Tuesday, November 26, 2024

MBNR : తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోంది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ఆగస్టు 15 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఆచరిస్తే… దేశం అనుస‌రిస్తోంద‌ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్ లో ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవి నాయక్, ఎస్పీ కే.నరసింహతో కలిసి జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తూ… పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు దేశ విదేశాల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ తెలిపారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి పోలీస్ కవాతును పరిశీలించారు.

ఆ తర్వాత విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు, పలు శాఖల శకటాలను మంత్రి పరిశీలించి, స్వాతంత్ర సమరయోధులను సన్మానించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేశారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి అయోగ్ నివేదికలో పేర్కొన్నదని, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జి.ఎస్.డీ.పి వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతుందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతంగా వలసల జిల్లాగా పేరుగాంచిందని, నేడు పచ్చని పంట పొలాలకు నెలవయ్యిందని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి తన ప్రసంగంలో జిల్లా ప్రజలకు వివరించారు. జిల్లా అభివృద్దిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ద కార్మికులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement