తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని, మహబూబ్‌నగర్‌లోని బండమీదిపల్లిలోని పరిశోధనా కేంద్రం ఎక్కడికీ తరలిపోదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గోపాలమిత్రల వేతనం రూ.3 వేలు మాత్రమే ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దానిని రూ.11 వేలకు పెంచామన్నారు. పాడి పరిశ్రమను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. గోపాల మిత్రల సేవలు ఎంతో విలువైనవని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, దానికి బదులుగా పశుపరిశోధన కేంద్రానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. వెటర్నరీ పాలిటెక్నిక్, పశుపరిశోధన కేంద్రం ఇక్కడి నుంచి తరలిపోతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement