Tuesday, November 26, 2024

గొర్రెల యూనిట్ల పంపిణీ..

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తులకు మంచి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా , మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని తిమ్మసానిపల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 62 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే 50 యూనిట్ల గొర్రెలను యాదవులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం గొర్రెల సంపదలో మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు ఉచితంగా గొర్రెల పంపిణీ చేయలేదని , కానీ తమ ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా గొర్రెల పంపిణీ చేయడమే కాకుండా గొర్రెల మేపుకునేందుకు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 315 కోట్ల రూపాయల విలువైన 5 లక్షల 27 వేల 835 గొర్రెలను యాదవులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిపోయిన వారికి కూడా గొర్రెల పంపిణీ చేసేందుకు తిమ్మసాని పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో యాదవుల జాబితాను రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుల వృత్తులకు ఎంతో మేలు జరిగిందని , గుర్తింపు వచ్చిందని అన్నారు. గతంలో ముదిరాజ్‌లకు గతంలో కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని , అలాంటిది ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 200 కోట్ల రూపాయల విలువ చేసే వలలు ,లూనాలను పంపిణీ చేశామని చెప్పారు. అదే విధంగా ఎస్సి కుల వృత్తుల వారికి వెయ్యి కోట్ల రూపాయలతో త్వరలోనే పథకాలు రాబోతున్నాయని వెల్లడించారు. తిమ్మసానిపల్లి గ్రామంలో గతంలో అనేక సమస్యలు ఉండేవని , అయితే ప్రస్తుతం ఇంటింటికి తాగునీరు , సిసి రహదారులు వేయించడం జరిగిందని , అంతేకాక పక్కనే ఉన్న తండాలో కూడా మిషన్‌ భగీరథ తాగునీటితో పాటు రహదారి వేయించామని , త్వరలోనే బి. టి రహదారి వేయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గొర్రెలు పొందిన యాదవులు ఎట్టి పరిస్థితుల్లోనూ గొర్రెలను అమ్ముకోవద్దని ఈ సందర్భంగా మంత్రి వి జ్ఞప్తి చేశారు. జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్‌ , గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌ గౌడ్‌ , పశు సంవ ర్దక శాఖ , జెడి మధుసూదన్‌ గౌడ్‌ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణష్‌ , కౌన్సిలర్లు రామ్‌ లక్ష్మణ్‌ , యాదవ సంఘం నాయకులు వెంకటేష్‌ , రవి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి గొర్రెల యూనిట్ల ప్రోసీడింగ్స్‌ ను లబ్దిదారులకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement