సీబిఎం ట్రస్ట్ ఛైర్ పర్షన్, ఎమ్మేల్యే సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ
అచ్చంపేట, జులై 20, ప్రభ న్యూస్ : నల్లమల ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదనే, వారి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచిత మెగా కార్డియాక్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, గుండె, నరాలు, ఎముకలకు సంబంధించిన చికిత్స అవసరమున్న వారికి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు అందించబడునని సీబీఎం ట్రస్ట్ ఛైర్ పర్సన్, అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సి.అనురాధ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఉచిత మెగా కార్డియాక్, న్యూరో, ఆర్థోపెడిక్ క్యాంపును అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ సి.వంశీకృష్ణ, కేర్ ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ జియా ఉర్ రహమాన్, డాక్టర్ నిఖిల్, డాక్టర్ హరిచరణ్, డాక్టర్. సుధాకర్, డాక్టర్ శశాంక్ జోష్ణలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీబీఎం ట్రస్ట్ ఛైర్ పర్సన్ డాక్టర్ సి.అనురాధ మాట్లాడుతూ…. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారం, హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ ప్రాంత నిరుపేద ప్రజల ఆరోగ్యానికి తోడ్పాటునందించడం ఆనందంగా వుందన్నారు. నేటి క్యాంపులో కేర్ ఆసుపత్రి వైద్యులచే 45 సంవత్సరాలు పైబడి వున్న వారికి షుగర్, బీపీ, ఈసీజీ, టూడిఈకో లాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, అత్సవసర సమస్య వున్న వారికి ఉచితంగా హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులచే ఆరోగ్యశ్రీ పథకం క్రింద వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాంపు నిర్వహణకు సహకరించిన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేశ్, ఆసుపత్రి డాక్టర్ల బృందం, కేసు ఆసుపత్రి వైద్య సిబ్బందికి, సాహితీ పారామెడికల్ కళాశాల నర్సింగ్ విద్యార్థినీ, విద్యార్థులకు, ప్రిన్సిపల్ గోవిందు రవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ గౌరీ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రఘురాం, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
లోపించిన సమన్వయం.. ఇబ్బందులు పడ్డ ప్రజలు, రోగులు…
ఉచిత మెగా క్యాంపులో చూయించుకోవడానికి వచ్చిన ప్రజలు, రోగులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రి వారు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ మెగా క్యాంపులో గుండె, నరాలు, ఆర్థోపెడిక్ విభాగాలను ముందస్తుగానే ఏర్పాటు చేయకపోవడం, వచ్చిన వారికి ఎక్కడ ఏ విభాగం ఉందో తెలియక, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, ఒక వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుకు ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రి నిర్వాహకుల సమన్వయ లోపం వల్లే ముందస్తు ఏర్పాట్లు చేయలేకపోయినట్లు ప్రజలు అభిప్రాయపడ్డారు.