Tuesday, November 19, 2024

కాంగ్రెస్ పార్టీకి నలుగురు కౌన్సిలర్ల రాజీనామా..

వనపర్తి / పెద్దమందడి, మార్చి 11 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ తరపున వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఉద్యమ నేత లక్కాకుల సతీష్ కుమార్ నివాసంలో పదవ వార్డు కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్, 31వ వార్డు కౌన్సిలర్ బండారు రాధాకృష్ణ, 21వ వార్డు కౌన్సిలర్ బాపనిపల్లి వెంకటేష్, 14వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మం చారి లు రాజీనామా పత్రాలపై సంతకాలు చేసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చిన్నారెడ్డి అంటే తమకి ఎంతో గౌరవం ఉందని, ప్రస్తుత పరిస్థితులను బట్టి నియోజకవర్గ ప్రజలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తిడుతున్నారని, అలాంటి సంఘటనలు చూసి విన్నప్పుడల్లా తాము కలత చెందుతూ మనోవేదనకు గురై రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులని ఆయనకు అగ్రనాయకత్వం దగ్గర మంచి గౌరవం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం కోల్పోయినందున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దూరమై కొత్త వారిని ఆహ్వానించాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం వేచి ఉన్న వ్యక్తులను ఆహ్వానించినా తమకు అభ్యంతరం లేదన్నారు.

మనోభావాలు దెబ్బతిన్నందుకే వ్యతిరేకించాం: పీసీసీ మాజీ సభ్యులు బండారు శ్రీనివాస్ గౌడ్
ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో పనిచేస్తున్న తమ అవసరం లేకుండానే కొత్త వారితో పని చేయించుకుంటానని మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి బాహటంగా ప్రకటించడం సీనియర్లందరినీ కలచివేసిందని పిసిసి మాజీ సభ్యులు మాజీ మార్కెట్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సీనియర్లు అవసరం లేదనే తరహాలో మాట్లాడినందుకే పార్టీలో విభేదాలకు కారణమయ్యాయని, సీనియర్లు అవసరం లేనప్పుడు ఏళ్ల తరబడి ప్రజలు వద్దంటున్నా 1990 దశకంలో నుంచి ప్రతిసారి ఇదే ఆఖరి ఎన్నికలంటూ ప్రజలను, నాయకులను, కార్యకర్తలను మభ్యపెడుతూ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీని, నాయకులను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఎన్నికలు వచ్చే ఆరు నెలల ముందు నియోజకవర్గానికి వచ్చి హడావిడి చేయడం చిన్నారెడ్డికి అలవాటైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి చిన్నారెడ్డి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వస్తాయన్నారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు రాకుంటే తాము ప్రాణ త్యాగం చేసేందుకు కూడా వెనకాడమన్నారు. త్వరలోనే పదివేల మంది నాయకులు, కార్యకర్తలను ఒక చోటికి సమీకరించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement