Monday, November 18, 2024

MBNR: ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు…

ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలి
లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి
నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు, హోటళ్ల‌పై కఠిన చర్యలు తీసుకుంటాం… ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌, మనోజ్
అచ్చంపేట, జూన్ 11, ప్రభ న్యూస్ : అపరిశుభ్రత పరిసరాల్లో ఆహార పదార్థాలు తయారు చేసిన, కల్తీ పదార్థాలను ఉపయోగించిన సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేసి సంబంధిత యజమానులపై చట్టరీత్యా కేసులు నమోదు చేయబడతాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్ హెచ్చరించారు. ఇవాళ‌ అచ్చంపేట పట్టణంలోని అమృతపాణి అరేబియన్ మండి రెస్టారెంట్, హోటల్ పరివార్, నేషనల్ హోటల్, హాజీపూర్ చౌరస్తాలోని బటర్ ఫ్లై హోటల్, అచ్చంపేట పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆహార పదార్థాల్లో కల్తీ ఉత్పత్తులు, కలర్లు వాడరాదని, అపరిశుభ్రత వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయరాదని, మాంసపు ఆహారాల్లో ఉపయోగించే చికెన్, మటన్, చేప మొదలు వాటిని ఏ రోజుకు ఆ రోజు కొనుక్కొని వాడాలని, కొనుగోలు చేసిన వారి నుండి రసీదులు తీసుకొని భద్ర పరచుకోవాలని సూచించారు. ఆహార పదార్థాల్లో తాజా సరుకులను ఉపయోగించాలని, కాలం చెల్లిన పదార్థాలను అసలు కలిగి ఉండరాదని హెచ్చరించారు.

రెస్టారెంట్లు, హోటళ్ల‌ యజమానులు కచ్చితంగా లైసెన్సు కలిగి ఉండాలని, లేనిచో వారిపై చర్యలు తీసుకొనబడునని, లైసెన్సు ఉల్లంఘించిన వారిపై ఆరు నెలల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. అమృతపాణి అరేబియన్ మండి రెస్టారెంట్లో కాలం చెల్లిన పరోటాలను అక్కడికక్కడే పడేయించారు. తనిఖీలు చేసిన అన్ని హోటళ్ల‌లోని ఆహార పదార్థాలను శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నామని, ల్యాబ్ రిపోర్టులో కల్తీ ఉన్నట్టు తేలితే సంబంధిత హోటళ్లు సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. లైసెన్సులు రెన్యువల్ చేయించుకోని వారికి నోటీసులు ఇచ్చారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధిక మోతాదులో కలర్ ను ఉపయోగించిన మంచూరియాలను నేలపాలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆఫీస్ సబార్డినేట్ వజిత్ వెంట ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement