భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆధ్వర్యంలో దేశభక్తి ఉప్పొంగేలా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్ ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారిని, వారి కృషిని, కారణాలను నేటి యువత క్షున్నంగా తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పాల్గొంటున్నందు వల్లనే విజయవంతం అవుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ కే.సి నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులు సత్యం యాదవ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఆర్డిఓ అనిల్ కుమార్, ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ, డీఎస్పీ మహేష్, మున్సిపల్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, స్వాతంత్ర సమర యోధుడు వకీల్ భీమయ్య, పలువురు జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.