మహబూబ్ నగర్, క్రైమ్, సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్) : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి. కె.నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన వెల్లడించారు.
ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. కోరారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఈ విషయంలో సహకరించాలని సూచించారు.