గద్వాలప్రతినిధి, ఏప్రిల్ 1 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తాన్న ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని ఉమిత్యాల గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9న రూ.2 లక్షల రూణమాఫీ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అన్నదాతలను పూర్తిగా ఆగం చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కానీ రైతులను ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపానా పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా రైతులు గురించి ఆలోచన కూడా చేయలేదన్నారు.