Saturday, November 23, 2024

MBNR: వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ డీకే అరుణ.. చల్లా వంశీచంద్ రెడ్డి

మక్తల్, ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్) : వెన్నుపోటు రాజకీయాలకు బీజేపీ నాయకురాలు డీకే అరుణ కేరాఫ్ అడ్రస్ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. డీకే అరుణ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజం అని అన్నారు. ఇవాళ మధ్యాహ్నం మక్తల్ పట్టణంలోని ద్వారకా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానంలో సొంత పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి తన తమ్ముడు బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపున‌కు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా గద్వాలలో బీసీ ముద్దుబిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి సరితమ్మ ఓటమిని జీర్ణిచుకోలేక సొంత పార్టీ అభ్యర్థి వాల్మీకి బోయ శివారెడ్డికి వెన్నుపోటు పొడిచి తన అల్లుడు బిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారని అన్నారు.

అలాంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.పార్లమెంటు ఎన్నికల్లో తనను తాను లోకల్ అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న డీకే అరుణ పానగల్ జడ్పిటిసిగా పోటీ చేసిన సమయంలో ఆమె ఎక్కడి లోకల్ అని ప్రశ్నించారు. ఆనాడు గుర్తుకురాని లోకల్ ఈరోజు ఎలా గుర్తుకొస్తుందని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. గద్వాల నియోజకవర్గంలో ఎవరిని అడిగినా డీకే అరుణను దొరసాని అంటారని తాను కూడా దొరసాని అంటానని ఆయన అన్నారు. పచ్చి రాక్షస రాజకీయాలు నడుపుతున్న డీకే అరుణకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి మక్తల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో తనను ఎంపిగా గెలిపించాలని వంశీచంద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కే.వనజ ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, నాయకులు గడ్డంపల్లి హనుమంతు, బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement