Monday, November 18, 2024

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని రక్షించిన పోలీసులు..

వనపర్తి : డయల్ 100కు వచ్చిన ఒక ఫోన్ కాల్ కు వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని రక్షించి అందరి మన్ననలు పొందారు వనపర్తి జిల్లా పోలీసులు. వనపర్తి టౌన్ డయల్ 100 పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.ఒక వ్యక్తి పినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.వచ్చి కాపాడండి అని ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే స్పందించిన వనపర్తి టౌన్ డయల్ 100 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొనే ఆ వ్యక్తిని కాపాడి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకొని అందరి మన్ననలు పొందారు.
ఇక వివరాలలోకి వెళితే వనపర్తి పట్టణ పొలీస్టేషన్ డయల్ 100 సిబ్బంది రామకృష్ణ, నాగరాజు, కిషోర్ లు విధి నిర్వహణలో భాగంగా బస్టాండ్ దగ్గర ఉండగా నేపాల్ రాష్ట్రానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నట్లు డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించారు. అతని చిరునామా గురించిన సమాచారం కోసం ఫోన్ చేసిన వ్యక్తికి కాల్ చేయగా తాను నల్లచెరువు దగ్గర ఉన్నట్లుగా మాత్రమే సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కాల్ చేయగా ఆ వ్యక్తి స్పందించలేదు. అతని గురించిన సమాచారం తెలుసుకుని కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని వ్యక్తిని కాపాడి, స్పృహ తప్పిన అతనికి ప్రథమ చికిత్స చేసి,ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ప్రజా రక్షణలో జిల్లా పోలీసులు నిరంతరం ముందుంటారని నిరూపించారు.ఆత్మహత్య చేసుకోబోయిన ఆ వ్యక్తి సమస్య తెలుసుకొని అతనిలో మనోదైర్యం నింపి కుటుంబ సభ్యులకి అప్పగించినట్లు ఎస్సై మధుసూదన్ వివరించారు.విధి నిర్వహణలో సమర్ధవంతంగా, చురుకుగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన వనపర్తి వన్ టౌన్ డయల్ 100 సిబ్బంది రామకృష్ణ, నాగరాజు, కిషోర్ లను వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు అభినందించారు. సకాలంలో స్పందించిన పోలీసు సిబ్బంది పనితీరు పట్ల స్థానికులు, ప్రజలు ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement