దేవరకద్ర : ప్రపంచ దేశాన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న కరోనా కేసులు తగ్గాలంటే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.మొదటి దశ కరోనా కన్నా రెండో దశ అతి భయంకరంగా ఉందని ప్రజలు అంటున్నారు.ఎప్పుడు ఏమౌతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.చాలామంది మాస్కులు ధరించడం లేదు.. కిరాణా షాపులో భౌతిక దూరం పాటించడం లేదు.అధికారులు ఎంత చెప్పినా కూడా ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు.రోజురోజుకు చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది కరోనా టెస్టులు నిర్వహించి వ్యాక్సిన్ ఇస్తున్నారని చెప్పారు.గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టేకన్నా లాక్ డౌన్ పెడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.లాక్ డౌన్ ఏర్పాటు చేస్తే కరోనా కట్టడి చేయవచ్చని ప్రజలు అంటున్నారు.
అధికారులు స్పందించాలి..
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు తగ్గాలంటే లాక్ డౌన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని పట్టణానికి చెందిన కొండా వీర రెడ్డి అన్నారు.గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కరోనా కేసులు విజృంభిస్తున్నాయని ఆయన అన్నారు.ఇవి పూర్తిగా తగ్గుముఖం పట్టాలంటే లాక్ డౌన్ తప్పనిసరని అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని ఆయన కోరారు.