అచ్చంపేట జూన్ 5, ప్రభ న్యూస్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంపును ప్రారంభించిన ఆయన స్వయంగా శస్త్ర చికిత్సలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఒక డాక్టర్‌గా, అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో వుంటూ సేవలందిస్తుంటానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పూర్తితో అచ్చంపేట నియోజకవర్గంలోని పేద ప్రజల ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా రాష్ట్రంలో ఎవ్వరూ, ఎక్కడా తలపెట్టని విధంగా మెగా సర్జికల్ క్యాంపును చేపట్టడం జరిగిందన్నారు. రికార్డు స్థాయిలో 1230 మంది శస్త్రచికిత్సలకు ఎంపిక కాగా, ఆపరేషన్ తీవ్రతను బట్టి దశల వారిగా ఆపరేషన్లు నిర్వహించుటకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ మెగా క్యాంపులో జనరల్ సర్జన్లు రామచందర్, మహేశ్, బాల్‌సింగ్, డాక్టర్ ఉదయ్, హరిత, అనెస్థిసియా డాక్టర్ ప్రభు, థియోటర్ ఇంచార్జి డాక్టర్లు శిరీష మొదలగు 20 మంది డాక్టర్లతో 4 టీములుగా శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.