మక్తల్, జనవరి10(ప్రభన్యూస్): జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీలకు నిరుపేద కుటుంబానికి చెందిన అక్క తమ్ముడు ఎంపిక రికార్డు సృష్టించారు. గత డిసెంబర్ నెల 30, 31 తేదీలలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయం కూలి పని చేసే నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్. వెంకటప్ప ఆర్. మణెమ్మ కూతురు ఆర్. స్వప్న , కుమారుడు ఆర్. మోహన్ చక్కని క్రీడా నైపుణ్యతను, క్రీడా మెలకువలను ప్రదర్శించి జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైనట్లు షూటింగ్ బాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్రాంత పి ఈ టి బి. గోపాలం తెలిపారు.
వీరి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ, కూతురు ఆర్ .స్వప్నను హైదరాబాదులో పిఈటి ట్రైనింగ్ పూర్తి చేయించారు. అదేవిధంగా ఆర్. మోహన్ కుమారుడి ని ములుగు జిల్లా కేంద్రంలో గల క్రీడా పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరిని పి ఈ టి బి.రూప సహకారంతో క్రీడల వైపు మళ్ళించారు. షూటింగ్ బాల్ కోచ్ , పి ఈ టి రమేష్ దగ్గర శిక్షణ పొంది జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు బి.గోపాలం తెలిపారు. సౌత్ జోన్ జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు సీనియర్ విభాగంలో ఆర్ .స్వప్న, జూనియర్ విభాగంలో ఆర్. మోహన్ అక్క తమ్ముడు ఇద్దరు ఈ నెల 12 నుండి 14 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగే జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలలో పాల్గొంటారని బి. గోపాలం తెలిపారు. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన గుర్లపల్లి గ్రామానికి చెందిన క్రీడా ఆణిముత్యాలు అక్క తమ్ముడైన ఆర్ .స్వప్న, ఆర్. మోహన్ లను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి .గోపాలం సర్పంచ్ కళావతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.