అచ్చంపేట రూరల్, జూన్, 13 (ప్రభ న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ దీపక్ కుమార్ హుడా అన్నారు. ఇవాళ అచ్చంపేట మండలంలోని పులిజాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు బాగా చదివే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎలాంటి వసతులు లేకున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామారావు, ఎంపీడీవో బాలచందర్ సృజన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంతటి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.