మక్తల్, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు వ్యతిరేక పార్టీ అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మక్తల్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ అన్నారు. మొన్న అమెరికాలో తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే మూడు ఎకరాలు పారుతుందన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడేమో రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా తనకు తాను నిరూపించుకుందన్నారు. గురువారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆ పార్టీ రైతులకు ప్రజలకు ఏం చెప్పదలుచుకుందో అర్థమైపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కోరడం ద్వారా రైతులు బాగుపడాలన్న ఆకాంక్ష ఆ పార్టీకి లేదని స్పష్టమవుతుందన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతున్నాయని, కుంటూ కుంటూ కర్ణాటకలో గెలిచింది తప్ప ఆ పార్టీ గొప్పతనం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను బూచిగా చూపి తెలంగాణలో గెలవాలని కలలుగంటున్నదనీ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాల ద్వారా ఆ పార్టీ పునాదులు కదిలించడం ఖాయమన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని కర్ణాటక ప్రాంతానికి చెందిన రైతులు సరిహద్దుల్లోని బైరంపల్లిలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సమావేశానికి వచ్చి మా గ్రామాలను కూడా నైజాం పాలన మాదిరిగా తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో రైతులే ఖతం చేయనున్నారని వారు పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక రైతాంగం సుభిక్షంగా జీవనాన్ని గడుపుతోందన్నారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం 73 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని వారు తెలిపారు. ఆన్ గోయింగ్ పథకాలు నిలిపివేయాలని కోరడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. రైతుల ఆగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బూడిద కావడం ఖాయమన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రైతు పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో తరిమికొట్టాలని వారు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షురాలు చిట్టెం సుచరిత రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా మహిపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చిన్న హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.