Sunday, June 30, 2024

MBNR: హ‌రీశ్ రావుకు అచ్చంపేట ఎమ్మెల్యే ఓపెన్ స‌వాల్

అచ్చంపేట, జూన్ 28, ప్రభ న్యూస్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావుకు అచ్చంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఓపెన్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీకి మెజార్టీ ఎలా వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విచక్షణ రహితంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని, తన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే హరీష్ రావు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకోవాలని, హరీష్ రావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించినట్లయితే త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.

శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీకి మెజార్టీ అధికంగా వచ్చిందని హరీష్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. హరీష్ రావు లాంటి నాయకుడు తన స్థాయికి మించి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రెడీమేడ్ గా చేసుకున్న సిద్దిపేటలో రెడీమేడ్ నాయకునిగా పోటీ చేసిన నువ్వు గెలవకముందుకే మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయగలిగావని సూటిగా ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రజల నుండి పుట్టుకొచ్చిన నాయకుడని జెడ్పిటిసిగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అంచలంచలుగా ఎదుగుతూ ప్రజా ఆశీర్వాదంతో నేడు ముఖ్యమంత్రి స్థాయిని చేరుకున్నారని ఫైర్ అయ్యారు.

హరీశ్ రావు ఆరోపిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బూత్ నెంబర్ 15లో బీఆర్ఎస్ కు 131 ఓట్లు వస్తే బీజేపీకి 103 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 694 ఓట్లు వచ్చాయని, అలాగే బూతు నెంబర్ 16 లో బీఆర్ఎస్ కు 65 ఓట్లు వస్తే బీజేపీకి 135 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 527 ఓట్లు వచ్చాయని, మొత్తానికి 983 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిందని ఎన్నికల అధికారులు ఇచ్చిన పత్రాలను చూపిస్తూ.. తాను చూయించిన ఓట్లలో ఒక్క ఓటు అటు ఇటుగా ఉన్నట్లు నిరూపించినా.. త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు.

- Advertisement -

రానున్న రెండు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగై పోవడం ఖాయమని, ఆ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయక తప్పదని ఆ క్రమంలోనే హరీశ్ రావును ముందుగా బీజేపీ పార్టీలోకి పంపి తర్వాత కేసీఆర్ కూడా బీజేపీలో తన పార్టీని విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మంత్రియా నాయక్, ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, బల్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతరెడ్డి, పండిత్ రావు, హరి నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement