Tuesday, November 26, 2024

మండలి విజేతకై ఎదురు చూపులు

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి హైద్రాబాద్‌ , రంగారెడ్డి , మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజధానిలోని ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియన రౌండ్ల వారిగా జరుగనుంది. ఒక్కో రౌండ్‌లో సుమారు 56 వేల ఓట్లను లెక్కించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసిన విధంగా తెలిసింది. ఇప్పటికే భారీగా పెరిగిన పోలింగ్‌ శాతంపై అంతర్మథనంలో పడ్డ అభ్యర్థులు ఆఖరికి ఆ విజేత ఎవరనేది పూర్తి ఫలితాలు వస్తేనే గాని తెలియదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా రౌండ్ల వారిగా బ్యాలెట్‌ పత్రాల కట్టలు ఏర్పాటు చేయడం , తదుపరి ఆయా బ్యాలెట్‌ పత్రాలలో అభ్యర్థుల ప్రాధాన్యతలను గుర్తించి లెక్కలు వేసుకోవడం. తొలుత యాభై శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. లేదంటే రెండవ ప్రాధాన్యత లెక్కింపు అభ్యర్థులు , చివరగా తక్కువ ప్రాధాన్యత కలిగిన అభ్యర్థులను తొలగించి చివరికి అత్యథిక ప్రాధాన్యత వచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటించే అవకాశాలుంటాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని మారుమూల పట్టణ పోలింగ్‌ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పెరిగిన ఓటింగ్‌ శాతం తమకే లబ్ది చేకూరుతుందంటూ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో పాటుగా ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లోనూ తమది కూడా విజయం ఖాయమంటూ బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. ఉదయం ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా రౌండ్ల వారిగా ఫలితాలు ప్రకటించడం , ఆలస్యమైతే 32 గంటలకు పైగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉండనుంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లిdలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు శాసన సభ సమావేశాలు , 5 రోజుల పాటు శాసన మండలి సమావేశాలు కొనసాగనున్నాయి. ఓ వైపు బడ్జెట్‌పై చర్చలు , మరో వైపు శాసన మండలికి వచ్చే కొత్త అభ్యర్థిపై ఉత్కంఠ , ఊహాగానాలు. మొత్తం మీద పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఒక్క రోజు సమయం గడవాల్సిందే. ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాలు ఉండటంతో పట్టభద్ర ఎమ్మెల్సిలతో పాటుగా , అన్ని పార్టీల అభ్యర్థులు , నాయకులు ముందస్తుగానే లైవ్‌ పోల్‌ ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement