Friday, November 22, 2024

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం

మహబూబ్‌నగర్‌ : గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఎంప్లాయిస్‌ చేస్తున్న సమ్మెకు పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం చేస్తుందని , కనుక ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాద్యత మనందరిపై ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. మరో పక్క కేంద్రం నూతన విద్యా విధానం పేరుతో దేశంలో ఉన్న అన్ని పాఠశాలలు మొత్తం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని , అదే కనుక దేశంలో అమలైతే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే విధానం ఏర్పడుతుందని తెలిపారు. దేశంలో కార్పోరేట్‌ విద్యా సంస్థలను తీసుకువచ్చే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందని , తక్షణమే నూతన విద్యావిధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉపాధ్యక్షుడు భరత్‌ , శివ, సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement