మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ , రంగారెడ్డి , హైద్రాబాద్ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. ఆయన హైద్రాబాద్ నుండి శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తున్న జిల్లాల కలెక్టర్లు , జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు , షామియానా వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని , అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారిగా బ్యాలెట్ పేపర్ , బ్యాలెట్ బాక్సులు , ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర విషయాలపై ఆయన జిల్లా ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు ఇదివరకు ఉన్న వాహనాలకు అదనంగా జిల్లాకు ఒక వాహనాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎంఎల్‌సి ఎన్నికల ఏర్పాట్లను వివరిస్తూ 14వ తేదిన నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని , పోలింగ్ సిబ్బంది ర్యాన్‌డమైజేషన్ పూర్తి చేశామని , అంతేకాక ఈ నెల 13వ తేదిన సూక్ష్మ పరిశీలకుల ర్యాన్డమైజేషన్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎమ్మెల్సి ఎన్నికలలో సుమారు 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక ఓటర్ ఓటు వేసేందుకు కనీసం 4 నుండి 5 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున పోలింగ్ కేంద్రంలో మరో ఓటర్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరగా , పోలింగ్ కేంద్రం సైజ్‌ను బట్టి అదనపు కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికలకు 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని , ఇంపుకు తగ్గట్టు బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని , పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను హైద్రాబాద్ తరలించేందుకు అదనపు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని , శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామా రావు , తేజస్ నందలాల్, డిఆర్‌ఓ స్వర్ణలత , ఆర్డిఓ స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ,తదితరులు హాజరయ్యారు.
జిల్లాల కలెక్టర్లు , ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement