Saturday, November 23, 2024

Mahabubnagar – మీ రాష్ట్రాలలో బిసిలను ముఖ్యమంత్రులుగా ఎందుకు చేయలేదు – బిజెపిని నిలదీసిన మంత్రి శ్రీనివాస గౌడ్

మహబూబ్ నగర్, నవంబర్ 27 (ప్రభ న్యూస్): తెలంగాణ లో అధికారం లోకి వస్తే బీసి ని సి ఎమ్ చేస్తామంటున్న బీజేపీ నాయకులు వాళ్ళు అధికారం లో ఉన్న ఉత్తరాధిలో ఎందుకు బీ సి సి ఎమ్ ను చేయడం లేదని మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు..మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మన్నె, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ పార్టీ మీటింగులో ఆ పార్టీ అధ్యక్షుడు ఇష్టానుసారంగా మాట్లాడిండని మంత్రి అన్నారు.అన్నీ అబద్ధపు కూతలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.

నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే వ్యక్తి గురించి ప్రజలకు బాగా తెలుసని అన్నారు. గురివింద మాటలు మాట్లాడితే ఎవరూ నమ్మరని… ప్రతపక్షాల తీరు తోడేళ్లు గొర్రెల మంద మీద పడినట్లుందని తెలిపారు. ఏం కష్టం చేసిండని రేవంత్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నాయకులు రౌడీషీటర్లను, దుర్మార్గులను వెంటేసుకుని తిరుగుతున్నారని అన్నారు. దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు చేసే వారిపై తప్పకుండా కేసులు పెడతారని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. దుర్మార్గాలు చేసే వారిపై కేసులు పెడతారు తప్పించి సాధారణ ప్రజలపై ఎందుకు కేసులు పెడతారని అన్నారు. పేద ప్రజల కోసం కడుతున్న హాస్పిటల్ ను హోటల్ అంటున్నారని… పర్యాటక శాఖ నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్ ను 99 ఏళ్ల లీజు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నరాని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న భవనం ప్రైవేటు, లీజు ఎలా అవుతుందని ప్రశ్నించారు.


తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏం కష్టం చేశాడని, ఏం పొలం దున్నాడని ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారని మంత్రి ప్రశ్నించారు. వాళ్ల తాత ముత్తాతలు ఏమన్నా రాజుల వంశమా… వ్యాపారాలు చేశారా… అని అన్నారు. ఒకరి గురించి మాట్లాడే ముందు వారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. రేకుల రూంలో ఇక్కడే ఉండిన వ్యక్తి ఇప్పుడు ఎంత ఆస్తులు కూడబెట్టాడో గమనించాలన్నారు. చీటింగ్, రౌడీషీటర్లు, కబ్జాలకు పాల్పడిన వాళ్లు వారి దందా నడవడం లేదని కాంగ్రెస్ వారితో జతకట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అందరూ వారిలా చిల్లరమల్లరగా ఉండరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన చరిత్ర తనదన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాడన్నారు. వారిలాగే అందరూ అక్రమాలు చేస్తారని ఊహించుకుని దొంగే అందరినీ దొంగా దొంగా అన్నట్లుగా ఆయన తీరుఉందన్నారు. పది మంది మోసగాళ్లు, ఇతరులపై బురద జల్లే వారిని వెంటేసుకుని ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి అప్పుడు సోనియా దయ్యం అన్నాడు.. ఇప్పుడు దేవత ఎలా అయ్యిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడని ఎన్నం శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి విమర్శలు చేశారు. ఇండియా, పాకిస్తాన్ పేరిట విభజన చేసి ముస్లింలందరినీ పాకిస్తాన్ వారిగా పోల్చి హిందువులంతా తనకే ఓటు వేయాలని కోరిన వ్యక్తి అని అన్నారు. ఇబ్రహీంకు ఓటేస్తే మీరు పాకిస్తాన్ వాళ్లు అన్న వ్యక్తి ఇప్పుడు ముస్లిం ఓట్లు ఏ విధంగా అడుగుతాడని ప్రశ్నించారు. కండువా మార్చుకోగానే ముస్లింలపై అంత ప్రేమ పుడుతుందా అని అన్నారు. అప్పుడు మతపరంగా ఇప్పుడు కులపరంగా విడగొట్టాలని చూస్తున్నాడని అన్నారు.

రెండు మతాల వారిని కలిపేందుకు తనకు పదేళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు రేవంత్, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలు రెడ్డి, నాన్ రెడ్డి పేరిట ప్రజలను కుల పరంగా విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కులాల పేరిట సమాజాన్ని విడదీస్తే సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి చరిత్ర అంతా మోసమేనని… తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో టీఆర్ఎస్ వదిలి మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే సీటు ఖాళీ కాగానే… బీజేపీలో చేరి హిందూ ముస్లిం వివాదంతో గెలిచి కేసులు పెట్టాడన్నారు. తర్వాత సొంత పార్టీ ఏర్పాటు చేసి అంతా మోసం చేసి బీజేపీలో చేరాడన్నారు. తర్వాత చేరికల కమిటీ బాధ్యత అప్పగిస్తే… సీట్లు అమ్ముకుని ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడని దుయ్యబట్టారు. ముస్లిం సోదరులు, ప్రజలంతా జరుగుతున్న వ్యవహారాన్ని క్షణ్ణంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు.

తన చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తానని పీసీసీ అధ్యక్షుడు అహంకారంతో మాట్లాడుతున్నడని… ఉద్యమం నుంచి బడుగుబలహీన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తనపై ఇలా దుర్మార్గంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక్క ఇంచు భూమి కబ్జా చేస్తే కోర్టులు, మీడియా వద్దకు వెళ్లే అవకాశం ఉన్న ఈ రోజుల్లో భూములు, ఆస్తులు కబ్జా చేసేందుకు అవకాశం ఉంటుందా అని మంత్రి అన్నారు. తనపై తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహిచేది లేదన్నారు.
ఓటుకు రైతు బంధుకు ఏం సంబంధమని రైతుబంధును ఆపించారని కాంగ్రెస్ నాయకుల తీరును మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, బీసీబంధు, దళితబంధు వంటి పథకాలన్నీ అప్పటికే ఉన్న పథకాలని వాటిని ఆపి ఏం సాధిస్తారని అన్నారు. రైతుబంధు రాకుంటే రైతుల పంట పెట్టుబడి పరిస్థితి ఏంటన్నారు. రైతుసోదరులారా… రైతుబంధు ఆపారంటేనే మీపై కాంగ్రెస్ నాయకులున్న కుట్రను అర్థం చేసుకోవాలన్నారు.

మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని… పెంచింది కలుపుకుని డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు ఇస్తామని తెలిపారు. కౌలుదారుకు రైతుసాయం ఇస్తామంటున్న రేవంత్ రెడ్డి… రైతులు తమ భూములను కౌలుకు ఇస్తారని అన్నారు. కౌలు రైతుకు పంట సాయం అనేది కాంగ్రెస్ నాయకుల అజ్ఞానికి నిదర్శనమన్నారు. బీసీలను ముఖ్యమంత్రులను చేస్తారట కానీ బీసీ నాయకులను అణగదొక్కుతాం అనేది బీజేపీ విధానమని అన్నారు. బీజేపీ నాయకులు దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు కానీ దేవునికి చేసిందేమీ లేదన్నారు. మతం పరంగా బీజేపీ, కులం పరంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మిథున్ రెడ్డిలది అహంకార పూరితమైన డీఎన్ఏ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సమాజాన్ని కులం, మతం పేరిట విడదీయడం తప్పించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కాదన్నారు. వారు బాగుంటే చాలని, సమాజం ఏమైనా వీరికి సంబంధం లేదన్నారు. వీరి చేతుల్లో పడితే మహబూబ్ నగర్ అల్లకల్లోలం అవుతుందన్నారు. ఈ చీడపురుగులు కిరాయి మనుషులతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారని అన్నారు. వీరి ఆటలు సాగబోవన్నారు.

ఈ సమావేశం లో మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ ఇంచార్జి చైర్మన్ కె.వెంకటయ్య, బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement