Tuesday, November 26, 2024

Mahabubnagar – అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు… ఎస్పీ కె.నరసింహ

మహబూబ్ నగర్,క్రైమ్ జులై 27 (ప్రభ న్యూస్): గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, రాగల 24-48 గంటలలో జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుంది కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కి మరియు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659359 మరియు 8712659360 కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరారు.

స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తామన్నారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాల కారణంగా బ్లాక్ అయిన రహదారులను దాటరాదని, ముఖ్యంగా ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదని పేర్కొన్నారు.
చెట్ల కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని సూచించారు.
వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కావున పరిమిత వేగంతో వాహనాలు నడపాలని వివరించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.
వర్షాల కారణంగా ప్రభలే విషజ్వరాలు,అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంతవరకు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వలన ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని, అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement