Friday, September 13, 2024

Mahabubabad – ప్ర‌తి బాధితుడినీ ఆదుకుంటాం … రేవంత్ రెడ్డి హామీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ :
ప్ర‌తి ఒక్క బాధితుడినీ ఆదుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం మ‌హ‌బూబాబాద్ జిల్లాలో వ‌ర‌ద న‌ష్టాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితుల‌ను మాట్లాడారు. మృతుల కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా, న‌ష్ట‌పోయిన పంట‌ల‌కు ఎక‌రాకు ప‌ది వేలు, ఇళ్ల‌లో సామాన్లుకు న‌ష్టం వాటిల్లిన బాధితుల‌కు ప‌ది వేల రూపాయ‌లు ప‌రిహారం అంద‌జేస్తామ‌న్నారు.

మూడు తండాలు ఒక్క చోట‌
బాగా దెబ్బ‌తిన్న‌ మూడు తండాల‌ను ఒక్క చోట ఏర్పాటు చేసి అంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని సీఎం చెప్పారు. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్‌కు సూచించారు. సీతారాం తండా లోని ఇస్లవాత్, మంగిలాల్ వ‌ర‌ద బాధిత‌ కుటుంబ సభ్యులతో ఆయ‌న మాట్లాడారు. అలాగే ఇల్లు కోల్పోయిన బాధితుల‌కు ఇందిర‌మ్మ మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలు సందర్శించి వారితో మాట్లాడి కావలసిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా క‌లెక్ట‌ర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

పాస్‌పుస్త‌కాలు.. స‌ర్టిఫికెట్ల‌కు ఒరిజిన‌ల్ ఇస్తాం
ఈ వ‌ర‌ద‌ల్లో పాస్‌పుస్త‌కాలు, స‌ర్టిఫికేట్లు, రేష‌న్ కార్డులు, విలువైన డాక్యుమెంట్లు పోతే వెంట‌నే పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం సూచించారు. ఎఫ్ఐఆర్ వ‌చ్చిన వెంట‌నే ఒరిజ‌న‌ల్ వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, విప్ రామచంద్ర నాయక్ తదితరులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement