మహబూబాబాద్: బిఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లే 60 ఏళ్లలో కనిపించని అభివృద్ధిని పదేళ్లలో చేయగలిగామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.. ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు , మరోవైపు అభివృద్ది పనులు సమతూకంగా ప్రజాశీర్వాదంతో చేస్తున్నామని చెప్పారు.. అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పధకాలను అందిస్తున్న పార్టీ తమదని అన్నారు.. మహబూబాబాద్ లో శుక్రవారంనాడు జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్ప, సంక్షేమం ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి ఐదు గంటల కంటే ఎక్కువ సేపు విద్యుత్ ను సరఫరా చేయడం లేదన్నారు. కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయిందన్నారు. మారుమూల ప్రాంతమైనా పట్టుబట్టి జిల్లాగా ఏర్పాటు చేసిన విషయాన్ని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకొని మన బాధలు పట్టించుకోలేదన్నారు. గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీని కూడ ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాలోని తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కలకలలాడుతుందన్నారు. రైతు బంధు అవసరం లేదని మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారన్నారు. రైతు బంధు ఉండాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు వద్దన్న వారికి బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
తెలంగాణలో రైతాంగానికి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. ధరణిని ఎత్తివేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ధరణి పోర్టల్ తో భూకబ్జాలు తగ్గిపోయాయని కేసీఆర్ చెప్పారు. రైతుల భూమి మీద రైతుకు మాత్రమే అధికారం ఉండాలని ధరణిని తీసుకువచ్చినట్టుగా కేసీఆర్ తెలిపారు. ధరణి లేకపోతే రైతుబంధు, రైతు భీమా ఉండదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని భట్టి విక్రమార్క చెబుతున్నారన్నారు. ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ కోరారు.