Wednesday, December 4, 2024

Maha Dharna – సీఎం రేవంత్ స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నాం .. బిజెపి

మూసీ గురించి రేవంత్‌కు.. ఏం తెలుసు?
బాధితుల‌కు అండ‌గా మేమున్నాం
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలోనే నివాసం ఉంటాం
అప్పు తెచ్చి మూసీ పున‌రుజ్జీవం అవసరమా?
కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఆగ్ర‌హం
బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదు
కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌
మూసీ బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌న్న ఈట‌ల‌
ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :

అసలు మూసీ పరివాహక ప్రాంతం గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ‌ కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్క‌డ పేద‌ల‌కు ప్రభుత్వాలే ఓటరు కార్డులిచ్చాయని, రోడ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలు క‌ల్పించాయ‌ని, ఇప్పుడు ఉన్నట్లుండి వాళ్ల ఇళ్లు కూల్చేస్తామనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం స‌వాలు స్వీక‌రిస్తాం

సీఎం సవాలు స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మూసీ ప్రజల ఇళ్లను కాపాడడం కోసం నదీ పరివాహక ప్రాంతంలో ఉండటానికైనా తాము సిద్ధమేనని కిష‌న్ రెడ్డి అన్నారు. పేదల ఇళ్లు కూల్చేస్తే చంచల్‌గూడ జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూసీ సుందరీకరణ ముఖ్యమా? కాలనీలకు రోడ్లు ముఖ్యమా? గ్రేటర్ మున్సిపాలిటీకి, వాటర్ బోర్డుకు, వీధి లైట్ల కోసం నిధులు లేవు గానీ, లక్షా 50 వేల కోట్లు అప్పు తెచ్చి మూసీ సుందరీకరణ అవసరమా..? అని ప్ర‌శ్నించారు. మూసీ పరివాహకంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ పరిస్థితి ఏంటి..? మూసీ పక్కన ఏళ్లుగా ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా..? పేదలపై ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు? అని కిషన్ రెడ్డి నిల‌దీశారు.

- Advertisement -

బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదు

బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదని, పేదల కోసం ఎంతవరకైనా పోరాడతామని, అవసరమైతే రాష్ట్రాన్ని దిగ్భంధిస్తామని కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్‌ని రూ.7 వేల కోట్లలో కట్టారని, వేల కిలోమీటర్ల పరిధిలో నిర్వహిస్తున్న నమామి గంగే ప్రాజెక్ట్‌ కు కేవలం రూ.40 వేల కోట్లేనని, కానీ మూసీకి మాత్రం దేశంలోనే అత్యధికంగా నిధులు ఖర్చుచేయడం ఏంటని నిల‌దీశారు. బీఆర్ఎస్‌ ఏక్ నిరంజన్ పార్టీ అని అంతా ఒక్కడిగా నడిచింద‌ని, . కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులే అని, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నార‌ని అన్నారు. అందుకే కాంగ్రెస్ పెద్ద డ్రామా కంపెనీలా తయారైంది అంటూ బండి సంజయ్ విమ‌ర్శించారు.

మూసీ బాధితుల‌కు అండ‌గా…
మూసీ బాధితులకు అండగా, వారి పక్షాన పోరాడటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా పేదల కన్నీళ్లతో రాష్ట్రం కకావికలమవుతోందన్నారు. అందుకే బాధితులందరికీ బీజేపీ తరపున ప్రతి నాయకుడూ పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement