భూపాలపల్లి, (ప్రభ న్యూస్) : విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్ సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)1, 2 దశల కర్మాగారాల ఉద్యోగులు, కార్మికులు బుధవారం విధులను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ప్రధాన గేటు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ .. దేశాభివృద్ధిలో భాగమైన విద్యుత్తు సంస్థలను, కేంద్ర ప్రభుత్వం తన మిత్రులుగా ఉన్న కొన్ని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2020 బిల్లు ద్వారా, గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు దేశంలోని 25 కోట్ల వినియోగదారులు, వ్యవసాయదారులు, పరిశ్రమ వర్గాలకు సరళమైన విద్యుత్తును అందిస్తూ.. దేశాభివృద్ధిలో భాగమైందన్నారు.
అలాంటి విద్యుత్ సంస్థలను ప్రభుత్వానికి సన్నిహితులుగా మెలుగుతున్న బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటు పరం చేయ్యాలని కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కోణంలో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థను విద్యుత్ సవరణ బిల్లు ద్వారా లాభార్జనతో పనిచేసే ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే ప్రయత్నాలను విద్యుత్ ఉద్యోగులందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సవరణ బిల్లు ద్వారా మన రాష్ట్రంలో 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులు, సుమారు కోటి తొంబై లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై ప్రభావం పడబోతోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని, ప్రమాదాలు పెరుగుతాయని, ప్రజలపై అధిక ఛార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జెన్కో యూనిట్ ఉపాధ్యక్షుడు చిలువేరు మల్లయ్య, కేటీపీపీ ఉద్యోగులు సంతోష్, తిరుపతి, పండరి, వేణు, శ్రవణ్, సమ్మయ్య, కనకరాజు, శ్రీను, రాజేందర్, రఘు, బాల బ్రహ్మచారి, అశోక్ ,రవీందర్, మురళి, సతీష్ ,లక్ష్మణ్, వెంకన్న, అశోక్, శ్రీనివాస్, లీల, ప్రమీల, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital