తెలంగాణ శాసన మండలి కొత్త చైర్మన్ ఎవరు? అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మండలి చైర్మన్ కానున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై సర్వత్ర ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీ అయ్యాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత పదవీకాలం ముగిసింది. జూన్‌లోనే పదవీకాలం ముగిసినా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. నవంబరు 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. మరణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ఎన్నిక కాబోతున్న ఎమ్మెల్సీల్లో ఒకరిని మండలి చైర్మన్ ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే మండలి చైర్మన్‌గా చేశారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో విరమణ చేసినప్పటి నుంచి మండలి పూర్తి స్థాయి చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం వి.భూపాల్‌రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో శాసన మండలి కొత్త చైర్మన్‌గా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన అనుభవంతో మధుసూదనాచారి మండలి చైర్మన్‌గా సరైన వ్యక్తి అని పార్టీలోని సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలను అధికార టీఆర్ఎస్ కే దక్కనుంది. సంఖ్యా బలం దృష్ట్యా ఆరు స్థానాలనూ టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే కానుంది. ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: చైనాలో మంచు దుప్పటి.. రోడ్లపై కుప్పలు తెప్పలుగా హిమపాతం