ఇగం.. ఇరగదీస్తోంది..!(లేదా)
- మావలలో కనిష్ట ఉష్ణోగ్రత 5.9 రికార్డు..
- రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు..
- సగం మంది పిల్లలు బడికి పోతలేరు..!
- స్కూల్ టైమింగ్స్ మార్చాలని సర్కార్ కు వినతి..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : దట్టమైన అడవులు.. చుట్టూరా నదులు, వాగులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లా చలిగాలులతో కాశ్మీరాన్ని తలపిస్తోంది. మంచు గడ్డ కట్టే రీతిలో చలి తీవ్రతకు గజగజ ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఏజెన్సీ మన్యంపై మంచు దుప్పటి కప్పుకోవడంతో బయటకు అడుగేయాలంటేనే జంకుతున్నారు. రహదారులపై మబ్బులు కొమ్ముకొని మంచు దుప్పటి ఆవహించుకోవడంతో పగటి వేళల్లోనూ వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లలు వృద్దులు, బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో యాచకుల పరిస్థితి కడుదైన్యంగా మారింది. ఆరోగ్యపరమైన సమస్యలతో వృద్ధులు పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గత నాలుగు రోజులుగా సింగిల్ డిజిట్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, శీతల గాలులు విస్తుండడం తో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణ ప్రాంతాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఆరెంజ్ హెచ్చరికలు.. స్కూల్ పనివేళలు మార్చండి..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున ప్రభుత్వం వెంటనే స్కూల్ టైమింగ్స్ మార్చాలని తల్లిదండ్రులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. సర్కారు ప్రైవేటు బడుల్లో చలి తీవ్రత కారణంగా సగం వంతు పిల్లలు కూడా హాజరు కావడం లేదు. సరిగ్గా నాలుగేళ్ల కిందట రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్కూల్ టైమింగ్స్ మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు విపత్కర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు.
మా బడికి సగం వంతు కూడా పిల్లలు రావడం లేదు.. టీచర్ జలంధర్
ఇంద్రవెల్లి ప్రభుత్వ హైస్కూల్లో మొత్తం1240 మంది విద్యార్థులున్నారు. ఏజెన్సీలో చలి తీవ్రత కారణంగా రోజుకు 400 నుండి 430 మంది మాత్రమే పిల్లలు బడికి వస్తున్నారు. చలి ప్రభావంగా జలుబు, దగ్గు జ్వరం ఇతర వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. బడి వేళలు మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ లో 5.9 డిగ్రీలు..
మంగళవారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు అదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. అదిలాబాదు, మావలలో 5.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆర్లి టి, బేల, జైనథ్, బేల, పెంబి, రాంనగర్, పొచ్చర కెరమెరి, చెప్రాల నేరడిగొండ లో ఇదే రోజు 6 నుండి 7 డిగ్రీల లోపు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.
బడుల పనివేళల మార్పుపై ప్రభుత్వానికి ప్రతిపాదన.. డిఇఓ ప్రణీత..!
ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత నేపథ్యంలో బడుల్లో పిల్లల హాజరు శాతం తగ్గింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుండి కూడా పాఠశాల పనివేళల పై వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ తో చర్చించి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ కు ప్రతిపాదన పంపాము. 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ టైమింగ్స్ మార్పు పరిశీలనలో ఉంది.