పొగడ్తాలతో గతి తప్పిన వివాహిత
17 ఏళ్ల బంధాన్ని కాళ్లదన్ని, భర్త, పిల్లలను వదిలి హైదరాబాద్‌కు
భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్‌జీఐఏ పోలీసులు
ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు.. విమానం ఎక్కిన వివాహిత
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఓ వ్యక్తి తన అందాన్ని పొగడగానే లండన్‌లో ఉన్న వివాహిత మనసు గతితప్పింది. మెసేజ్ చేయగానే తన 17 ఏళ్ల వివాహ బంధాన్ని కాలదన్నింది. లండన్‌లో లక్షల్లో సంపాదించే భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. ఓ ట్యాక్సీ డ్రైవర్ మాటలు నమ్మి లండన్ నుంచి గెంతులు వేసుకొని హైదరాబాద్‌కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, తిరిగి భర్త వద్దకు పంపించేందుకు విమానం ఎక్కించారు.
గూగుల్ పే నెంబర్‌తో పరిచయం పెంచుకున్న డ్రైవర్
హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఓ జంటది 17 ఏళ్ల వివాహ బంధం. వీరికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె సంతానం. కొన్నాళ్ల క్రితం భర్తకు లండన్‌లో జాబ్ రావడంతో అతడు అక్కడికి వెళ్లాడు. ఈ ఏడాది ప్రారంభంలో మహిళ తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఆమె అస్తికలను కలిపేందుకు వెళ్తూ ఓ ట్యాక్సీని బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. అనంతరం ఆ ట్యాక్సీ డ్రైవర్ శివకు గూగుల్ పే ద్వారా బిల్లు చెల్లించింది. ఇక అప్పటి నుంచి ఆమెపై కన్నేసిన డ్రైవర్ శివ.. ఆమె ఫోన్‌కు నిత్యం మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత అతని పొగడ్తలకు మహిళ లొంగిపోయింది. దీంతో అతడితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అత్తింటి వారు ఆమె భర్తకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గత నెల 16న ఆమెను, పిల్లలను కూడా లండన్‌కు రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లినా మహిళ తన తీరు మార్చుకోలేదు. ట్యాక్సీ డ్రైవర్ శివతో చాటింగ్ కొనసాగించింది.
ఇలా వచ్చింది ఆమె…
గత నెల 29న భర్త తల్లి చనిపోవడంతో ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఆ మరుసటి రోజే వివాహిత తన ఇద్దరు పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి.. ఎవరికీ చెప్పకుండా ట్యాక్సీ డ్రైవర్‌ను బర్త్‌డే వేడుకల కోసం ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరుకుంది. తల్లి ఎటో వెళ్లిపోయిందని పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో అతను లండన్ వెళ్లి ఆరా తీయగా.. భార్య హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది.
భర్త ఫిర్యాదుతో….
తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది. వెంటనే భర్త ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెకు ఫోన్ చేయగా తన లైవ్ లొకేషన్‌ను పోలీసులకు పంపింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసిన పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద ట్యాక్సీ డ్రైవర్ శివ, వివాహితను అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్‌జీఐఏ పోలీసులను కోరడంతో.. వారు సోమవారం సాయంత్రం లండన్ విమానం ఎక్కించారు. మరోవైపు ట్యాక్సీ డ్రైవర్ శివపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.