లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన స్పీకర్ ఓం బిర్లా
చేతిలో రాజ్యాంగం పుసక్తంతో ప్రమాణం
పార్లమెంట్లో కనిపించనున్న సోనియా, రాహుల్, ప్రియాంక
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ: వయానాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ లోక్‌సభలో గురువారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రియాంక భారీ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవగా.. ఆయన రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు. వయనాడ్ నుంచి మొదటిసారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక భారీ మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
మీ ప్రోత్సాహం మరువలేనిది..
ఈ సందర్భంగా ప్రియాంక తన గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. తన ప్రచారం కోసం పనిచేసిన యూడీఎఫ్‌లోని సహచరులు, కేరళలోని కాంగ్రెన్ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్డ్ వద్రా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిదని కొనియాడారు.
ఆ ముగ్గురూ పార్లమెంట్‌లోనే..
ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆ స్థానం నుంచి ప్రియాంక మొదటిసారిగా ఎంపీగా పోటీ విజయం సాధించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న సోనియా గాంధీ ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు సోనియా గాంధీతో పాటు.. కొడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంటులో కనిపించనున్నారు.