Saturday, November 23, 2024

ఆరో తేది త‌ర్వాత తెలంగాణాలోనూ లాక్ డౌన్?

ఉండొచ్చంటున్న ప్రభుత్వ వర్గాలు
సుప్రీంకోర్టు, నిపుణుల సూచనల నేపథ్యంలో లాకడౌేన్‌పై చర్చ
ప్రతిరోజూ సీఎస్‌, సీఎంవో కార్యదర్శితో మాట్లాడుతున్న కేసీఆర్‌
ఆక్సిజన్‌, మందులు, బెడ్ల కొరత లేకుండా చర్యలు

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి పెట్టారు. కరోనా కేసుల తీవ్రత పెరుగుతూ.. వైద్యరంగంపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు, నిపుణుల సూచనల మేరకు కట్టడి అంశాలపై సీఎం కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎపిలో కర్ఫ్యూ సమయం పొడిగింపు, ఒడిషాలో లాక్‌డౌన్‌ వంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం లాక్‌ డౌన్‌పై రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవాలని సోమవారం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఉండదని ఇప్పటికి పలుమార్లు ప్రక టించింది. అయితే కట్టడికి సంబంధించి సీఎం వివిధ వర్గా లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మే 8 ఉదయం వరకు నైట్‌ కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనుండగా, తర్వాత ఏం చేద్దాం అన్న అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా సీఎంవో కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డిని నియమించి ఎప్పటికపుడు మందులు, బెడ్లు, ఇతర వసతుల కొరత లేకుండా.. జాగ్ర త్తలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ మరో వైపు నియామ కాల ప్రక్రియపై దృష్టి సారించారు. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లకు అధికారాలిచ్చారు. ఓ వైపు వైద్యపరంగా సన్నద్దత, సౌకర్యాల కల్పన కొనసాగిస్తూనే.. మరోవైపు దేశవ్యాప్త పరిణామాలు, భవిష్యత్తు సవాళ్ళపై దృష్టి సారించారు. కనీసం రెండు వారాల లాక్‌డౌన్‌ విధించా లని నిపుణులు సూచిస్తుం డగా, ఆదివారం ఒడిషా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిం చింది. సుప్రీంకోర్టు కూడా.. లాక్‌డౌన్‌ చివరి అస్త్రం అని సూచిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ కిట్ల కొరత కూడా తీవ్రంగా ఉండగా, ప్రతిరోజూ మోగుతున్న మరణమృదంగం.. పెరుగుతున్న మృతులసంఖ్య కలవరపెడుతోంది. ప్రస్తు తం ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష జరపాలని, కరోనా ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు సీఎస్‌ ఎప్పటికపుడు.. పర్యవేక్షిస్తున్నా, కొనసాగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం తర్వాత చర్యలపై దృష్టిపెట్టారు. ఈనెల 6 తర్వాత కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం విధిస్తున్న ఆంక్షలను మరింత పెంచవచ్చన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుండి ఉదయం 5గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఎపిలో మధ్యాహ్నం 12గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ అనుభవాల దృష్ట్యా.. కరోనా కట్టడిపై రాష్ట్రం పలు మార్గాలను పరిశీలిస్తోంది. ఈ నెలాఖరువరకు జాగ్రత్తగా ఉంటే.. కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కర్ఫ్యూ సమయాన్ని మరింత పెంచితే.. ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఎపి తరహాలో.. కర్ఫ్యూ సమయం పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా భయాలతో ప్రజారవాణా ఇప్పటికే కుదేలు కాగా, ఒక్క ఆర్టీసీలోనే వందమందికి పైగా మృతిచెందారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉండగా, మరణాల సంఖ్య అనూహ్యంగా ఉండడం సమాజంలో కలవరాన్ని కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల అనుభవాలను, సెకండ్‌ వేవ్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ ఆంక్షలు పెంచే ప్రతిపాదనను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రజల ఉపాధి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ కు మొగ్గుచూపని సీఎం.. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ గడువు, సమయం పొడిగించే అవకాశాలున్నట్లు తెలిసింది. తాజా ప్రతిపాదనలు, ప్రచారంపై అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారోనని.. వైద్యరంగ నిపుణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement