Friday, November 22, 2024

ఆధార్‌కార్డుతో ఆచూకీ దొరికింది.. తప్పిపోయిన బాలుడు, తల్లిదండ్రుల చెంతకు

మహబూబాబాద్‌ కల్చరల్‌, ప్రభన్యూస్‌: అనుకోకుండా ఆధార్‌ కార్డు ఉందని తెలుసుకుని 7నెలల తర్వాత తప్పిపోయిన బాలుడి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించిన విశేష సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నాడు డోర్నకల్‌ రైల్వేస్టేషన్లో 2021 ఆగస్టు 22న తప్పిపోయిన 13 సంవత్సరాల బాలుడిని గుర్తించిన మహబూబాబాద్‌ జిల్లా బాలల సంరక్షణ విభాగం,చైల్డ్‌లైన్‌ సిబ్బంది బాబును వెంటనే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశాల మేరకు మహబూబాబాద్‌లోని దైవ కృప చిల్డ్రన్స్‌ హోమ్‌లో రక్షణ కల్పించారు. ఆ బాలుడు ప్రస్తుతం అనారోగ్యంగా ఉండడంతో బాలల పరిరక్షణ అధికారి బానోత్‌ వీరన్న దైవకృప చిల్డ్రన్స్‌హోమ్‌, జిల్లా కలెక్టర్‌ లోకేష్‌ ఆదేశాల మేరకు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్‌, ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మెదడులో నీరు రావడం వల్ల ఆనారోగ్యంతో ఉన్నాడని తెలియజేయడంతో బాబు ఆరోగ్యం కోసం మందులు వాడుతున్నారు. అనుకోకుండా ఆధార్‌కార్డు కోసం బాలుడు ఫింగర్‌ ఫ్రింట్స్‌ పెట్టడంతో అప్పటికే అతనికి ఆధార్‌ కార్డు ఉందని బాలుడి పేరు సాయికిరణ్‌గా గుర్తించారు.

అతడిని మందమర్రి జిల్లా యాపాల గ్రామానికి చెందిన నగావత్‌ తిరుపతి, లక్ష్మిల కుమారుడిగా గుర్తించారు. వెంటనే శుక్రవారం మహబూబాబాద్‌ బాలల సంరక్షణ అధికారి నరేష్‌, మంచిర్యాల జిల్లా అధికారి సత్తయ్యకు సమాచారం అందించగా అంగన్‌వాడీ టీచర్‌ ద్వారా విషయం తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు బాబును గుర్తించి శనివారం ఉదయం మహబూబాబాద్‌ బాలరక్షా భవన్‌కు చేరుకుని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, బాలల సంరక్షణ అధికారులను కలిసి బాబు తప్పిపోయిన విషయం తెలిపారు. సిడబ్ల్యుసి చైర్మన్‌ డాక్టర్‌ నాగవాణి, సభ్యులు డేవిడ్‌ ధృవపత్రాలు పరిశీలించి తల్లిదండ్రులకు అప్పగించాలని నిర్ణయించారు. వెంటనే బాబును పిలిపించడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులను చూడగానే వారిని గుర్తించి తండ్రి ఒడికి చేరాడు. ఏడు నెలలుగా బాబు ఆచూకీ కోసం వెతుకుతున్నామని, బాబును చూడగానే తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అక్కున చేర్చుకున్నారు. బాబును చూసిన తల్లిదండ్రులు అసలు బాబు ఎలా తప్పిపోయాడో వివరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం యాపాల గ్రామానికి చెందిన వారు 2021 ఆగస్టు20న బాబు తప్పిపోయినట్లు మందమర్రి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలతా లెనినా, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగవాణిని, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలరక్షాభవన్‌ కో-ఆర్డినేటర్‌ జ్యోతి,అధికారులు బానోత్‌ వీరన్న, బొలగాని నరేష్‌, సోషల్‌ వర్కర్‌ వెంకన్న,కౌన్సిలర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement