Friday, November 22, 2024

Locals Only – అన్ని మెడిక‌ల్ సీట్లు ఇక్క‌డ‌ బిడ్డ‌ల‌కే … రేవంత్ కు హరీశ్ రావు సూచన

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న మెడిక‌ల్ ప్ర‌వేశాలు
వంద శాతం సీట్లు తెలంగాణ‌కే
దీనిపై చ‌ర్య‌లు తీసుకోండి..
విభ‌జ‌న చ‌ట్టంతో భారీగా సీట్లు కోల్పొయే అవ‌కాశం
నాన్ లోకల్ కోటాలో 520 సీట్లు
అవి కూడా ఇక్క‌డ వారికే ఇవ్వాలి
రేవంత్ స‌ర్కార్ కు మాజీ మంత్రి హ‌రీష్ రావు విన‌తి..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా కోల్పోతారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారు. దీంతోపాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు అని హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.

- Advertisement -

520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది

రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుండి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసులుబాటు కల్పించారు. ఇదే విధానం కొనసాగితే, 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని నివారించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసింద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. దీనికోసం ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్/డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించాయి. అయితే ప్రస్తుతం జూన్ 2తో విభజన చట్టానికి కాలం చెల్లుతుందటంతో పాత మెడికల్ కాలేజీలోని 100 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు హ‌రీశ్‌రావు.

ఎంబీబీఎస్ సీట్లు 8340..
తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. ఎంబీబీఎస్, పీజీ సహా ఇతర వైద్య విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ బిడ్డలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే, స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి. కన్వీనర్ కోటాలోని 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డాక్టర్ కావాలనుకునే వైద్య విద్యార్థుల అవకాశాలు మెరుగుపరచాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement