చేర్యాల: లోకల్.. నాన్ లోకల్ కాదు.. అభివృద్ధిలో పోటీ పడండని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పల్లాకి ప్రజలు అడుగడుగునా ప్రజలు బ్రహ్మారథం పట్టారు. కళ్యాణి గార్డెన్లో జరిగిన సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… నేను నాన్ లోకల్ అని ఎన్నికల్లో నాతో తలపడడం చేతగాని వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారని, తాను ఈ ప్రాంతానికి చెందిన వాడిననీ, లోకల్ నాన్ లోకల్ అని విమర్శించడం మానేసి జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నాతో పోటీ పడాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ఎన్నికల్లో తనని గెలిపిస్తే ఎన్నికలు అయిపోయిన నెల రోజులలోపే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేర్యాల ప్రాంతంలో అనేక మంది మిత్రులున్నారని, ఈ ప్రాంతం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో అభిమానం ఉందని, చేర్యాల ప్రాంతంలో ముఖ్యమంత్రికి అనేకమంది మిత్రులున్నారని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు…
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను కచ్చితంగా అందిస్తామని, చేర్యాల పట్టణానికి కావలసినన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదల చేయిస్తానని, చేర్యాల పట్టణ అభివృద్ధికి కావలసిన నిధులు 18వ తేదీన జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రితో విడుదల చేయించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు సతీష్, చంటి, నరేందర్, బి రాష్ట్ర నాయకులు ముత్యాల బాల నరసయ్య, జల్లి సిద్ధయ్య, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీని బుజ్జగించిన పల్లా…
చేర్యాల మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ పార్టీ మారతాడనే సమాచారంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపీపీ శ్రీధర్ ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటే ఎంపీపీ శ్రీధర్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.