కస్టడీ ఇవ్వవద్దంటూ కవిత లాయర్ వాదన
బయలకు వస్తే సాక్ష్యాలు తారుమారన్న ఈడీ
కేసు పురోగతి వివరాలు న్యాయమూర్తికి అందజేత
60 రోజులలలోను కవితపై ఛార్జీషీట్ వేస్తామన్న ఈడీ
న్యూఢిల్లీ – లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.
మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.