విచారణకు సమయం కావాలన్న సిబిఐ
27 న కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడి
ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
సోమవారం వాదనలు వింటామన్నఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్లపై ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7న ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
వాదనలు సోమవారానికి వాయిదా
ఈడీ కేసులో, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్‌కు సంబంధించిన వివరాలు కవిత న్యాయవాదికి ఇవ్వాలని హైకోర్టు ఈడీని ఆదేశించింది. అనంతరం వాదనలను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్-19 ప్రకారం కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని, ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ సోమవారం నాడు జరగనుంది.