Tuesday, November 26, 2024

ఎస్ ఎల్ ఆర్ ద‌ర‌ఖాస్తుల‌కి లైన్ క్లియ‌ర్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పరంపర వేగం పుంజుకొన్నది. ఉన్నత స్థాయిలో ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటివరకు ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. క్షేత్రస్థాయిలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం దరఖాస్తుల పరిశీ లన పురోగతిలో వేగం పెరిగింది. ఈ మేరకు అధి కారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పనుల్లో నిమగ్న మయ్యారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలనే నిబంధనను క్రమబద్దీకరణ లో పేర్కొంటూ పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ నిబంధనకు ఒప్పు కుని సమ్మతించిన దరఖాస్తుదారులకే నిర్ధేశిత రుసుములను వసూలు చేసి క్రమబద్దీకరణ పూర్తి చేయాలని సర్కార్‌ భావిస్తోంది. లే అవుట్ల క్రమ బద్దీకరణ కోరుతూ 2020లో ప్రభుత్వం దర ఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్‌ 30ని కటాఫ్‌ తేదీగా పేర్కొంటూ స్వీకరించిన దరఖాస్తులకు భారీగా స్పందన వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుంచి 21లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. అయితే పరిశీలన, కార్యాచరణ మొదలు పెట్టకముందే న్యాయస్థానంలో కేసు నమోదైంది. దీంతో అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాన్ని కోర్టు ఆదేశాలతో పక్కనపెట్టారు. దీంతో రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్లు, ఇంటి నిర్మాణాలు నిల్చిపోయాయి. దీంతో ప్రభుత్వం పలు మార్గాలను ఆన్వేశించింది. ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో కొన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.

దరఖాస్తు చేసుకున్న అర్హులకు క్రమబద్దీకరించే అవకాశం ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఇతర మార్గాలను అమలు చేయాలని నిర్ణయించింది. కోర్టు తుది తీర్పుకు లోబడి వ్యవహరిస్తామనే అంశాన్ని ఇందులో పొందుపరుస్తూ ఎవరికీ ఇబ్బందిలేని రీతిలో దరఖాస్తులదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే క్రమబద్దీకరించేందుకు సిద్ధమైంది. ఇలా క్రమబద్దీకరించుకున్న దరఖాస్తులదారుల నుంచి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన వారి నుంచి 14శాతం అదనంగా పన్నులు వసూలు చేసి అనుమతిస్తున్నారు. ఇదే పద్ధతిని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఎవరికీ ఇబ్బందులు ఉండవనే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. డిసెంబర్‌లోగా ప్రజలకు వీలైనంత మేర ఇబ్బందులను, అడ్డంకులను తొలగించే క్రమంలోనే ప్రభుత్వం యోచిస్తోంది.

2020 అక్టోబర్‌ 30నాటికి క్రమబద్దీకరణ కోరుతూ ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా అన్ని పట్టణాలు, నగరాల్లో దరఖాస్తుల పరిశీలన మొదలైంది. మే నెలాఖరులోగా ఈ ప్రక్రియను ముగించేలా కసరత్తు చేస్తున్నారు. ఇలా 21 లక్షల దరఖాస్తులను క్రమబద్దీకరించి భారీగా ఖజానాకు రాబడిని చేర్చాలనే కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు.
క్రమబద్దీకరణతో ప్రభుత్వానికి భారీగా రాబడి సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్రమబద్దీకరించి రూ.10 వేల కోట్ల ఆదాయం పొందొచ్చని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో ఖజానాకు ఆదాయంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఈ కార్యక్రమాన్ని మే నెలాఖరులోగా పూర్తిచేసి ఉత్తమ ఫలితాలను పొందాలని సర్కార్‌ పావులు కదుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement