ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో : ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో రంగారెడ్డి జిల్లా ముందుంటోంది. విపత్కర పరిస్థితుల్లో కూడా రవాణాశాఖ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. గత ఏడాదికి సంబంధించి ఎలాంటి టార్గెట్లు ఇవ్వలేదు. అయినా రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుని నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. రూ.878.84కోట్లమేర ఆదాయాన్ని సమకూర్చుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. ఇందులో 90శాతం మేర ఆదాయం లైఫ్ ట్యాక్సుల ద్వారానే సమకూర్చుకోవడం గమనార్హం. హైదరాబాద్ మహానగరం చుుట్టూరా రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండటంతో ఉపాధి నిమిత్తం వచ్చే వారి సంఖ్య ఎక్కువే. వీరిలో చాలామంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వీటిద్వారా ఎక్కువ ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం ఆదాయాన్ని పెంచుకుంటుపోతున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులున్న ఆదాయం మాత్రం తగ్గలేదు. ఇబ్బందుల్లో కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరింది.
గత సంవత్సరం కరోనా పూర్తిగా తగ్గని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు టార్గెట్లు ఇవ్వలేదు. ఐనా రంగారెడ్డి జిల్లాలో ఆశించినమేర ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రూ. 878.84కోట్లమేర ఆదాయం సమకూరింది. ఇందులో లైఫ్ ట్యాక్సుల కింద దండిగా ఆదాయం వచ్చింది. దీని ద్వారా ఏకంగా రూ. 714.34కోట్లు సమకూరింది. ప్రతిసంవత్సరం లైఫ్ ట్యాక్సు ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. ఫీజుల ద్వారా రూ. 65.89కోట్లు, సర్వీస్ ట్యాక్స్ ద్వారా రూ. 16.52కోట్లు, ఎన్‌ఫోర్సుమెంట్ ద్వారా రూ. 8.04కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరంలో చాలారోజులు కరోనా ఇబ్బందులపాలు చేసినా రవాణాశాఖకు మాత్రం ఆదాయం తగ్గలేదు.
ఏడాదికి లక్ష వాహనాలు.
వాహనాల కొనుగోళ్లలో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతిఏటా దాదాపుగా లక్ష వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 13లక్షల నుండి 14లక్షల వరకు అన్ని రకాల వాహనాలున్నాయి. హైదరాబాద్ చుట్టూరా రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండటంతో వాహనాల కొనుగోలు పెరుగుతోంది. ఉపాధి…ఉద్యోగాలు…పిల్లల చదువుల కోసం వచ్చేవారి సంఖ్య శివార్లలో రోజురోజుకు పెరుగుతోంది. వచ్చిన వాళ్లు వారి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు…కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు ఇంజనీరింగ్, మెడికల్…జూనియర్ కాలేజీలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. వీళ్లు బస్సులు ఏర్పాటు చేస్తారు. పాత వాహనాలు తొలగించి కొత్త వాహనాలుు కొనుగోలు చేస్తుంటారు. శివార్లలో ఎక్కువ శాతం వాహనాలకు రంగారెడ్డి రిజిస్ట్రేషన్లు ఉంటాయి. నేడు చిన్న కుటుంబం కూడా తప్పనిసరిగా వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం మొదలుకుని తమ ఆర్థిక పరిస్థితులను బట్టి కార్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో వాహనాల కొనుగోలు పెరుగుతోంది..
ఆదాయ సేకరణలో నంబర్ వన్.
ఆదాయ సేకరణలో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ ఆదాయాన్ని సేకరించడంలో ముందు వరుసలో నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కేవలం మూడు రవాణాశాఖ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. అత్తాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, షాద్‌నగర్ కార్యాలయాలున్నాయి. ఇందులో ఆదాయ సేకరణలో అత్తాపూర్ ముందు వరుసలో నిలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్ కూడా ఆశించినమేర ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. షాద్‌నగర్‌లో మాత్రం కాస్త వెనకబడింది. అక్కడ దాదాపుగా గ్రామీణ ప్రాంతం కావడంతో ఆశించినమేర ఆదాయం సమకూరడం లేదు. మొత్తానికి రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానంలో నిలుస్తోంది.