Monday, November 18, 2024

దివ్యాంగులకు చేయూత.. వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు: మంత్రి పువ్వాడ

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచనతో దివ్యాంగుల మోటార్ వాహనాలకు రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. దివ్యాంగుల రవాణా వాహనాల బదలాయింపు విషయంలోనైనా దివ్యాంగులే యజమానైన వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నదని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరం మేరకు యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు, పింఛన్లు, రుణాలు సమకూరుస్తూన్నదని మంత్రి అన్నారు.

వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్స్‌ తదితర పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3016లు పింఛన్‌ ఇస్తూ భరోసాను కల్పిస్తున్నదన్నారు. దివ్యాంగులు గ్రూపులు మారి డీఆర్‌డీఏ ద్వారా రుణ సదుపాయాలు పొందుతున్నారని, కిరాణ షాపులు, టీ స్టాల్స్‌, ఆసక్తి ఉన్న పనుల్లో ఉపాధి పొందేలా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశాలు (కేటగిరి) ఉన్నాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించి, దివ్యాంగుల వయోపరిమితిని పదేండ్లకు సీఎం కేసిఆర్ పెంచారని వివరించారు. బస్సుల్లో కూడా ప్రత్యేక రాయితీలు కల్పించామని దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి రూ.లక్ష రూపాయలు ప్రోత్సాహకం ప్రభుత్వం ఇస్తున్నదని మంత్రి అజయ్ చెప్పారు

దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు అధిక మొత్తంలో పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను సీఎం కేసీఆర్ రూ.3,016 పెంచారన్నారు. దీంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దివ్యాంగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలే దివ్యాంగ విద్యార్థుల మెస్‌ చార్జీలు కూడా పెంచామని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించే గొప్ప మానవతామూర్తి సీఎం కేసీఆర్‌, దివ్యాంగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే కార్యక్రమాలను చేపట్టనున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement