అమీర్ పేట్, ప్రభన్యూస్ : రెండేళ్ల క్రితం ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధి బల్కం పేట్ లో చోటుచేసుకున్న ఓ హత్య ఘటనలో నిందితునికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు ధృవీకరించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం బల్కం పేట్ లో తన కుమారుడు బేకనాడా సంతు అలియాస్ బంజాల్ సంతోష్ (22) తో కలసి తల్లి సంగీత(50) నివాసం ఉండేవారు. ఇదిలా ఉండగా గంజాయి, మద్యం కు బానిసైన కొడుకు సంతు జనవరి 9వ తేదీ 2021 లో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన వ్యక్తిగత అవసరాల కోసం తల్లి సంగీతను డబ్బులు అడిగాడు. ఈ నేపధ్యంలో తన దగ్గర డబ్బులు లేవని, ఇవ్వలేనని తల్లి సంగీత చెప్పడంతో కోపోద్రిక్తుడు అయిన కొడుకు సంతు తల్లిని కత్తితో అతి దారుణంగా హతమార్చాడు, సంగీత అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది.
ఆ సమయంలో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీస్ లు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను ఎస్ఆర్ నగర్ పోలీస్ లు న్యాయస్థానం కు సమర్పించారు. హైదరాబాద్ మొదటి అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి డి.రమాకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పూర్వాపరాలను పరిశీలించి నిందితుడు సంతు కు యావజ్జీవ శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ లు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీస్ లు తెలిపారు.