Tuesday, November 26, 2024

TG: ఇక తిట్లు బంద్‌.. అభివృద్ధిపై ఫోకస్‌ పెడదాం.. బండి సంజయ్

  • సమన్వయంతోనే ముందుకు సాగుదాం..
  • కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తా..
  • గ్రామాల ప్రగతితోనే రాష్ట్రం, దేశాభివృద్ధి
  • పేదలను ఆదుకుంటేనే సంఘాలకు మనుగడ
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌
    సిరిసిల్ల, జులై 8 (ప్రభన్యూస్‌): ఎన్నికల తంతు ముగిసింది.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌ చేద్దాం.. విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే దృష్టి సారిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్ల పట్టణంలోని మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపానికి విచ్చేసి రూ.10లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు ప్రగతి బాట పడితేనే రాష్ట్రం, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.

అలాగే కుల సంఘం ఆఫీస్‌ నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతోందని, కానీ కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ ల్యాడ్స్‌ నిధులిస్తున్నానని, ఏ కుల సంఘమైనా సరే ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే వారికి మనుగడ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజోపయోగ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. మున్నూరు కాపు సంఘం పెద్దల ప్రతిపాదన మేరకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి సహకరిస్తానన్నారు.

రెండోసారి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు. రెండోసారి గెలవడం వల్లే మోదీ కేబినెట్‌లో చోటు దక్కిందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతో పాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్‌ పెట్టి ముందుకు సాగుదామన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement