Sunday, November 24, 2024

TS: వెయ్యి ఉరుల మర్రిని ఏడాదిలోగా స్మృతివనంగా తీర్చిదిద్దుతాం… బండి సంజయ్

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 21 (ప్రభ న్యూస్) : వెయ్యి ఉరుల మర్రిని ఏడాదిలోగా స్మృతివనంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి స్మారక స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందని, అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు మరుగున పడేసారని, వెయ్యి ఉరుల మర్రి చరిత్రను సమాజానికి తెలియజేసిన వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకూడదనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, గతంలో వెయ్యి ఉరుల మర్రి స్థానంలో ఎలాంటి కట్టడం లేదని, ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఒక వర్గానికి చెందిన సమాధిని ఇక్కడ ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ అమరవీరుల స్మారక స్తూపంతో పాటు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని, స్మృతివనం ఏర్పాటుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, ఎవరైనా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెయ్యి మంది వీరులను ఎక్కడ ఉరితీసారో అక్కడే స్మృతివనం ఏర్పాటు చేస్తామని, రాంచి గుండు చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే రామారావు, పార్టీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement