Monday, November 25, 2024

TS: పండుగలను మతసామరస్యంగా జరుపుకుందాం.. ఏవీ రంగనాథ్

మతాలకు అతీతంగా మన పండుగలను మత సామరస్యంగా నిర్వహించుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసారు. ట్రె సిటికి చెందిన వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నచోటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు గుర్తించాలన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదేని చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నారు. ఏ వర్గం వారికైనా ఇతరుల వలన ఇబ్బందికర సమస్యలు తలెత్తితే, పరిష్కారానికై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప స్వతహాగా వ్యవహరించకూడదన్నారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఆ పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తూ ఆ పోస్టుల్లో నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, అందుబాటులో వున్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ ఉల్లంఘించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గతంలో ఎన్నడూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఇదే సంస్కృతిని కొనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలని కోరారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తప్పకుండా తెలియజేయాలని తెలిపారు. అందువలన మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే అవకాశం ఉంటుందని, పోలీస్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. గణేష్ మండపాల వద్ద భాద్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు, సీసీ కెమెరా ఏర్పాటు, షాట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్వహణ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి బారి, ఏసిపిలు బోనాల కిషన్, డేవిడ్ రాజు, జితేందర్ రెడ్డి, భోజరాజు, ఇన్సెస్పెక్టర్లు, ఎస్.ఐలతో పాటు మత పెద్దలు భద్రకాళి దేవాస్థానం ప్రధాన పూజరి శేషు, తెలంగాణ అర్చన సంఘం అధ్యక్షుడు గంగు ఉపేందర్ శర్మకాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మైనార్టీసెల్ సభ్యుడు దర్శన్ సింగ్, సామ్యూల్, అతీఖ్ రహమాన్, గణేష్ ఉత్సవ కమిటీ కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్ మరికొందరు మత పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement