Friday, November 22, 2024

Big Story | సమైక్యపాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే‘లెండి’.. 40ఏళ్లుగా సాగని పనులు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అంతరాష్ట్ర బహుళార్ధక సాధక ప్రాజెక్టు లెండికి ప్లాన్‌ వేసి ఆర్ధశతాబ్దం, పనులు ప్రారంభించి 40 ఎళ్లు గడుస్తున్నా పట్టిన గ్రహణం వీడక పనుల్లో పురోగతి కరువైంది. 1975లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ వేసి 1984లో ఆంధ్ర-మహారాష్ట్ర అంతరాష్ట్ర ప్రాజెక్టుగా లెండి నిర్మాణపనులకు శంకు స్థాపన చేశారు. అయితే నాటి సమైక్యపాలకులు ప్రాజెక్టుపై శ్రద్ధ తీసుకోకపోవడంతో నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 10 గేట్లు బిగించారు. మరో 4 గేట్లు బిగించాల్సి ఉంది. అయితే బిగించిన గేట్లు, తవ్విన కాలువలు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. ప్రధానంగా భూసేకరణ సమస్య ఈ ప్రాజెక్టును ప్టటి పీడిస్తోంది.

మహారాష్ట్ర రైతుల నుంచి భూమి సేకరించేందుకు ఆక్కడి ప్రభుత్వం చొరవ చూపడంలేదనే విమర్శలున్నాయి. 1984 లో పోల్చుకుంటే భూముల రేట్లు పెరగడం, రైతులు కోరిన రేట్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర సిద్ధం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు భూసేకరణపై దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం సమస్యగా మారింది. అలాగే ఆప్పటి ఆంధ్రపాలకులు మహారాష్ట్రతో పేచీలు పెట్టడంతో ఆప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పట్ల శ్రద్ధ చేపలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ ఆవిర్భవించగానే సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించి ప్రాజెక్టు నిర్మాణానికి కావల్సిన అనుమతులు సాధించారు.

తెలంగాణలో భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దశలవారిగా చర్చలు జరుపుతూ క్రమేణ ప్రాజెక్టు నిర్మాణ వాతావరణానికి అనుకూలతను కేసీఆర్‌ తీసుకువస్తున్నారు. ప్రాజెక్టు శంకు స్థాపన చేసినప్పుడు అప్పటి పాలకులు చేసిన నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలిన లెండి నిర్మిస్తే వేలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇకప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే తెలంగాణ-మహారాష్ట్ర అంతర్‌ ప్రాజెక్టు లెండి మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌ తాలూకా,గొనెగాం గ్రామం దగ్గర ఉంది. ఈ ప్రాజెక్టు నీటిని 38:62 నిష్పత్తిలో తెలంగాణ-మహారాష్ట్ర పంపకాలు చేసుకునేందుకు అప్పట్లోనే ఒప్పందం జరిగింది. మహారాష్ట్రలో ప్రాజెక్టు హెడ్‌ వర్క్‌ పనులు 75 శాతం పూర్తి కాగా తెలంగాణలో 25.14 కి.మీ. కాలువల మట్టి పని పూర్తి అయింది. 6.36 టీఎంసీల నీటి సామర్ధ్యం గల ఈ ప్రాజెక్టు నీటిని మహారాష్ట్ర 3.93 టీఎంసీలు తెలంగాణ 2.43 టీఎంసీల వినియోగానికి ఒప్పందం కుదిరింది.

- Advertisement -

అయితే 1984 లో ప్రాజెక్టు అంచనావ్యయం రూ. 54,55 కోట్లు కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మిగతా పనులు పూర్తి చేయాలంటే నిర్మాణ పనులకు రూ. 1000 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు. అయితే నిధులు ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ప్రస్తుత అంచనా వ్యయం మేరకు నిధులు ఖర్చుచేయడానికి, భూసేకరణకు తెలంగాణ సిద్ధంగా ఉండటంతో పాటుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కామారెడ్డి, మద్నూర్‌, బిచ్కుంద మండలాల్లో దాదాపుగా 22 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. అయితే మహారాష్ట్ర భూసేకరణ పనులు త్వరిత గతిన పూర్తి చేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశాలున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం భూసేకరణకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు దాదాపుగా 75 శాతం పూర్తి అయిన నేపథ్యంలో భూసేకరణ పూర్తి చేసి తెలంగాణ-మహారాష్ట్రలో 60వేల ఎకరాల సాగుకు నీరందించేందుకు రెండు రాష్ట్రాప్రభుత్వాలు కృషిచేయాల్సిన అవసరంఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులకోసం రాష్ట్ర బడ్జెట్‌ లో రూ. 318 కోట్ల కేటాయింపులు కూడా ఉన్నాయి. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురై 40 ఏళ్లుగా నిర్మాణ దశలో నిలిచి పోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ఈ మేరకు మహారాష్ట్ర తో జరుపుతున్న చర్చలు ఫలించి లెండి అంతరాష్ట్ర ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కామారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement