Friday, November 22, 2024

TG | మా వాళ్ళని వదలండి : కేటీఆర్

రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డిలను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి ? అని ప్రశ్నించారు. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనమ‌న్నారు. ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదన్నారు.

ఇది ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం అని మండిపడ్డారు. అక్రమంగా నిర్భంధించిన బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారుకు దుమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని హితవు పలికారు. అప్పుడే గుండెపగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement