Friday, November 22, 2024

TS | ఓసారి లీక్‌, ఇప్పుడు రద్దు.. గ్రూప్‌-1 విషయంలో ఎందుకీ నిర్లక్ష్యం: హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)పై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 రద్దు చేయాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ టీఎస్‌పీఎస్‌సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది. నిబంధనలను మీరే ఉల్లంఘిస్తే ఎలా? అంటూ ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఒకసారి పేపర్‌ లీకైందని, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య..ఇలా అయితే ఎలా అని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అసలు బయోమెట్రిక్‌ను పరీక్షలప్పుడు అమలు చేయడం వల్ల వచ్చిన ఇబ్బందేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని టీఎస్‌పీఎస్‌సీని కోర్టు చివాట్లు పెట్టింది. గ్రూప్‌-1 కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. గతంలో బయోమెట్రిక్‌ అమలు చేసిన వివరాలు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలతో సహా మునుపటి పరీక్షల పూర్తి గణాంకాలతో రావాలని టీఎస్‌పీఎస్‌సీని బెంచ్‌ ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్‌ ఎందుకు అమలు చేయలదు? అని కోర్టు ప్రశ్నించింది.

మీ నోటిఫికేషన్‌ను మీరే అమలు చేయకపోతే ఎలా..ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తతో నిర్వహించాలి కదా? అని పేర్కొంది. నిరుద్యోగుల్లో టీఎస్‌పీఎస్‌సీ పట్ల విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందికదా అని తెలిపింది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్‌సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయి అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

మళ్లి నిర్వహిస్తే మూడోసారి…!
503 గ్రూప్‌-1 పోస్టులకు ఏప్రిల్‌ 26 తేదీన గతేడాది టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌ 11న రాష్ట్ర వ్యాప్తంగా మళ్లిd ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించింది. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ఓఎంఆర్‌ షీట్‌పై హాల్‌టికెట్‌ నంబర్‌ లేదనే పలు అంశాలను ఎత్తిచూపుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి బెంచ్‌ గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని, తాజాగా మరోసారి నిర్వహించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు టీఎస్‌పీఎస్‌సీ వెళ్లింది. అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ ఈసందర్భంగా టీఎస్‌పీఎస్‌సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పునే డివిజన్‌ బెంచ్‌ కూడా ఒకవేళ ఇస్తే మరోసారి గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించక తప్పదు. అదేజరిగితే గ్రూప్‌-1 పరీక్ష మూడు సార్లు నిర్వహించినట్లవుతోంది. బహుశా ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదనుకోవచ్చు. ఇది అభ్యర్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్రూప్‌-1 మొదటిసారి గతేడాది నిర్వహించినప్పుడు అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్న టీఎస్‌పీఎస్‌సీ రెండో సారి నిర్వహించినప్పుడు మాత్రం చాలా కేంద్రాల్లో తీసుకోలేదు. అయితే కాసిస్టేబుల్‌, ఎస్‌ఐ పోలీస్‌ రిక్రూంట్‌మెంట్‌లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్న పోలీసు శాఖ…గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల భర్తీ విషయంలో దాన్ని టీఎస్‌పీఎస్‌సీ ఎందుకు అమలు చేయడంలేదంటూ పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

గతేడాది గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌కు మినహాయిస్తే గతంలోనూ టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఏ పరీక్షలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయలేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో దాన్ని అమలు చేయలేదనే వాదనను కోర్టు ముందు టీఎస్‌పీఎస్‌సీ వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బయోమెట్రిక్‌ తీసుకోవడం ద్వారా సమయం, డబ్బు వృథా అనే అభిప్రాయాలను టీఎస్‌పీఎస్‌సీ వ్యక్తం చేస్తున్నట్లుగా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement