Sunday, November 17, 2024

Navy Radar Station: రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా నేడు నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన

హైదరాబాద్ – నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపనకు సిద్దమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌కు ఇవాళ మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరగనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో హెలిప్యాడ్‌ను సిద్ధం చేసి, అక్కడి నుంచి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు.

- Advertisement -

పదేళ్ల క్రితమే రాడార్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించినా.. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకానికి పచ్చజెండా ఊపి రాడార్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

.

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తొలుత రూ.1900 కోట్ల అంచనా వ్యయం కాగా ఆ తర్వాత రూ.2500 కోట్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం.. రూ.3200 కోట్లకు పెరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 2010-12లో ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం కాగా, 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు వచ్చేసరికి భూముల కేటాయింపులో జాప్యం జరిగింది. ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్నందున నేవీ, మిలటరీ, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక కమాండోలతో పాటు కేంద్ర రక్షణ, నేవీ విభాగాలతో వేదిక వద్ద కార్డన్ ఏర్పాటు చేయగా, బయట భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. 400 మందికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. హాలు ఆవరణలో 500 మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా మరో 200 మందికి వసతి ఉండేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి తగు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement