Thursday, November 21, 2024

పిజెటిఎస్ఏయులో పిహెచ్ డి, పిజి కోర్సుల ఆఫ్ లైన్ కౌన్సిలింగ్ ప్రారంభం

రాజేంద్రనగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి పిహెచ్ డి, పిజి కోర్సుల ఆఫ్ లైన్ కౌన్సిలింగ్ బుధవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్ లోని వర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 7వ తేదీ వరకు ఈ ఆఫ్ లైన్ కౌన్సి లింగ్ కొనసాగనుంది. మొదటిరోజు బుధవారం పిహెచ్ డి కోర్సులకి కౌన్సిలింగ్ జరిగింది. విశ్వవిద్యాలయ ఇన్‌ ఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పి.జగన్ మోహన్ రావు, నేచురల్ రిసోర్స్ మేనేజిమెంట్ -2 కోర్సులో వెంకటేశ్ అనే అభ్యర్థికి సీటు కేటాయింపు పత్రాన్ని అందించి కౌన్సిలింగ్ ప్రక్రియని లాంఛనంగా ప్రారంభించారు. మౌనిక యాదవ్ అనే అభ్యర్థికి డీన్ పిజి స్టడీస్ డాక్టర్ వి.అనిత , శ్రావణి అనే అభ్యర్థికి ఎస్సి, ఎస్టి సెల్ ఆఫీస్ ఇన్‌ ఛార్జి డాక్టర్ సుహాసిని కేటాయింపు పత్రాలని అందజేశారు. కోవిడ్ విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రొఫెసర్ జగన్మోహన్ రావు అన్నారు.

అయినప్పటికీ విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా సాధ్యమైనంత వరకు అకడమిక్ క్యాలెండర్ ను అమలు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులందరూ ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అదేవిధంగా కళాశాలలో చేరే వారికి టుడే నెగటివ్ రిపోర్ట్ ఉండాలన్నారు. కోర్సులని జనవరి 17వ తేదీన ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రొఫెసర్ అనిత తెలిపారు. ఈసారి సిలబస్ లో మార్పులు ఉంటాయని వెల్లడించారు. డిగ్రీ, పిజి, పిహెచ్ఐలు వివిధ యూనివర్సిటీల్లో అభ్యసిస్తే, వివిద సంస్క్రృతులు, పద్దతులు, టెక్నాలజీలని అందిపుచ్చుకొనే అవకాశం విద్యార్థులకి కలుగుతుందని ప్రొఫెసర్ అనిత అభిప్రాయపడ్డారు. ఎస్సి , ఎస్టి సెల్ ద్వారా విద్యార్థులకి అనేక రకాలుగా తోడ్పాటుని అందిస్తున్నామని ప్రొఫెసర్ సుహాసిని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అనేక నూతన టెక్నాలజీలని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రావణుమార్, డాక్టర్ సురేష్ కుమార్, తదితరులు పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలని పాటిస్తూ కౌన్సిలింగ్ ను నిర్వహించారు. జనవరి 6, 7 తేదీల్లో పిజి కోర్సులకి కౌన్సిలింగ్ జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement