తెలంగాణలో పోలీస్ ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం ఈ మధ్యనే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి గాను రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియను చేపడుతోంది. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో సుమారు లక్ష దరఖాస్తులు మహిళల నుంచి వచ్చాయి. 6 శాతం ఓసీ, 53శాతం బీసీ, 22శాతం ఎస్సీ, 19శాతం ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేశారు. చివరి రోజుల్లో దరఖాస్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ బోర్డు భావిస్తున్నది. ఈ నెల 20తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఆ దరఖాస్తు గడువు తేదీ పెంచేది లేదని బోర్డు తెలిపింది.