నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మామడ మండలంలోని కలెక్టర్ కార్యాలయ సముదాయంలో గల సర్వే ల్యాండ్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని బుధావర్ పేట్‌కు చెందిన సల్లా హరీశ్‌కుమార్ కు భూమికి సంబంధించి సేత్వార్ ప్రతి, తోంచ్ చిత్రపటం జారీ చేసేందుకు అసిస్టెంట్ డైరెక్టర్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. అయితే ఆ యువకుడు ఏసీబీ అధికారాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అటెండర్ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ జగదీష్ లను రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ.. ల్యాండ్ సేత్వార్ కోసం లంచం తీసుకుంటూ అటెండర్ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ జగదీష్ పట్టుబడ్డారని, వారిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.